రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలి – రెవెన్యూ డివిజన్ కొనసాగించాలి

రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలి – రెవెన్యూ డివిజన్ కొనసాగించాలి

డిసెంబర్ 27న “చలో అమలాపురం కలెక్టరేట్ ముట్టడి”ని జయప్రదం చేయండి– సిపిఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ పిలుపు


గత ఆరు నెలలుగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని, రెవెన్యూ డివిజన్ కొనసాగించాలని కోరుతూ అఖిలపక్ష జేఏసీ, ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాలు, ప్రజలు నిరంతర పోరాటం కొనసాగిస్తున్నప్పటికీ, కూటమి ప్రభుత్వం ప్రజల న్యాయమైన డిమాండ్లను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందని సిపిఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ తీవ్రంగా ఖండించింది.


శనివారం ద్రాక్షారామలోని సిపిఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలకు సుపరిపాలన అందిస్తామని, రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలోనే కొనసాగిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, గెలిచిన తర్వాత ఏటి దాటాక తెప్ప తగలేసినట్లుగా ప్రజలను మోసం చేసింది. ‘కోనసీమ వద్దు బాబోయ్’ అంటూ ప్రజలు ఆరు నెలలుగా రోడ్లెక్కి పోరాడుతున్నా ప్రభుత్వానికి చలనం లేకపోవడం దారుణం. 2013లో డివిజన్ హోదా ఇచ్చి, నేడు తొలగించడమేనా అభివృద్ధి? ప్రజల ఆకాంక్షలను పక్కన పెట్టే ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారు ఈ సత్యాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలి” అని హెచ్చరించారు.

ఈ రెండు కీలక డిమాండ్ల సాధన కోసం డిసెంబర్ 27న “చలో అమలాపురం కలెక్టరేట్ ముట్టడి” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించి, ప్రజలంతా భారీగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.అఖిలపక్ష జేఏసీ కన్వీనర్ మాగాపు అమ్మిరాజు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలనే ప్రజల డిమాండ్ కోసం వైయస్సార్ పార్టీ, టీడీపీ పార్టీల అగ్ర నాయకత్వం తమ వారసత్వ రాజకీయాలు, ఆధిపత్య రాజకీయాలు విడిచిపెట్టి ముందుకు రావాలి” అని పిలుపునిచ్చారు.

జేఏసీ కో-కన్వీనర్ బి. సిద్ధూ మాట్లాడుతూ ఆరు నెలలుగా ప్రజలు ఉద్యమిస్తుంటే, నియోజకవర్గంలో నెలకొన్న గందరగోళాన్ని పట్టించుకోకపోవడం చూస్తుంటే, మంత్రి సుభాష్‌కు ప్రజల రాజకీయ అవసరం లేదనే అనుమానం కలుగుతోంది. జిల్లా విషయంలో కనీసం ఒక ప్రకటన కూడా చేయలేని దుస్థితికి ఆయన నెట్టబడ్డారు. కూటమి ప్రభుత్వం రామచంద్రపురం ప్రజలను ఘోరంగా మోసం చేసింది” అని మండిపడ్డారు.

ఈ సమావేశంలో

అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు వెంటపల్లి భీమశంకరం,

సీపీఐ నాయకురాలు శారద,

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మోర్త దొరబాబు,

అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ బీసీ సెల్ కన్వీనర్ కడలి రాంపండు,

బీఎస్పీ రామచంద్రపురం నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ఆలీ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విక్టర్ నంద తదితరులు మాట్లాడుతూ 

ప్రజల సౌలభ్యం, పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని, రెవెన్యూ డివిజన్ కొనసాగించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 27న చలో అమలాపురం కలెక్టరేట్ ముట్టడిని ప్రజలంతా జయప్రదం చేయాలి అని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ద్రాక్షారామ జై భీమ్ సంక్షేమ సంఘం నాయకులు గుబ్బల శ్రీను, ఉండ్రు కార్తీక్, చల్లపూడి పట్టాభి రామయ్య తదితరులు పాల్గొన్నారు.