అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలు మరువలేనివి

 సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్

 


అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకొని  రామచంద్రపురంలోని వాసవి కళ్యాణ మండపం ఆవరణలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ మహానుభావుడిని స్మరించుకోవటం ప్రతి ఒక్కరి  బాధ్యత అన్నారు.  త్యాగం, ధైర్యం, నిస్వార్థ సేవకు  అమరజీవి పొట్టి శ్రీరాములు ఒక ఉదాహరణగా నిలుస్తారని అన్నారు.

ఆయన చిన్ననాటి నుంచే దేశభక్తి, సేవాభావం బలంగా నింపుకున్నారన్నారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై సత్యం, అహింస మార్గంలో నడిచారని, స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని, సమాజ సేవను తన జీవిత లక్ష్యంగా చేసుకున్నారని గుర్తు చేశారు. ఆంధ్ర ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలనే కోరికతో ఆయన చేసిన త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. కోట్లాది ఆంధ్రుల ఆకాంక్షను గుండెల్లో పెట్టుకుని, 1952లో నిరాహార దీక్ష ప్రారంభించారన్నారు.

58 రోజుల పాటు ఆహారం లేకుండా పోరాడి, చివరకు 1952 డిసెంబర్ 15న తన ప్రాణాలను అర్పించారు. ఆయన మరణం దేశాన్ని కదిలించింది. ఆ త్యాగ ఫలితంగానే 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు.

స్వార్థం లేని సేవ, ధైర్యంతో కూడిన పోరాటం, ప్రజల కోసం జీవించడం, పొట్టి శ్రీరాములు 

 చూపిన మార్గంలో నడుద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూ టమి పార్టీ నాయకులు  కంచుమర్తి బాబురావు తదితరులు పాల్గొన్నారు.