ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా - ప్రజా దర్బార్

 మంత్రి సుభాష్ ప్రజా దర్బార్ కు 800 అర్జీలు

  ప్రతి సమస్యను పరిష్కరిస్తా- మంత్రి వాసంశెట్టి సుభాష్


ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ కార్యక్రమం  నిర్వహించడం జరిగిందని, నిత్యం ప్రజల సమస్యల స్వీకరణ కొనసాగించడమే కాకుండా, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. సోమవారం రామచంద్రపురంలోని  మంత్రి క్యాంప్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ ప్రజా దర్బార్ కు రామచంద్రపురం, రామచంద్రపురం రూరల్ గ్రామాల నుంచి 800 మంది అర్జీలు ఇచ్చారు. కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, ముఖ్యమంత్రి సహాయ నిధి  కోరుతూ, ఇళ్ల స్థలాలు, ఉద్యోగ అవకాశాలు, స్మశాన వాటికలు, డంపింగ్ యార్డ్స్  తదితర సమస్యలపై  అర్జీలు వచ్చాయి. మంత్రి సుభాష్ స్వయంగా ఆర్జీలు పరిశీలించి  తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులును ఆదేశించారు. కొంతమంది దివ్యాంగులు  వేదిక వద్దకు రాలేని పరిస్థితి ఉండగా  మంత్రి సుభాష్ స్వయంగా వారి వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్బంగా మంత్రి సుభాష్  మాట్లాడుతూ ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే లక్ష్యంతో ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ పని చేయడం జరుగుతుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  ఆదేశాల మేరకు ప్రతివారం  రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో గ్రీవెన్స్ డే’గా   ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే విధంగా ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుందని, వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, అర్జీ నమోదు  చేసి, దాని పరిష్కారం వచ్చే విధంగా చర్యలు తీసుకుంటూ, ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చూపడం జరుగుతుందని పేర్కొన్నారు.

 రామచంద్రపురం రెవిన్యూ డివిజన్ యధాతధం

 మంత్రి సుభాష్  మీడియాతో మాట్లాడుతూ రామచంద్రపురం రెవిన్యూ డివిజన్  రెండు మండలాలతో అయినా యధాతధంగా  నిర్వహిస్తామని, అవకాశాన్ని బట్టి మరో రెండు మండలాలను రామచంద్రపురం డివిజన్లో చేర్చే విధంగా  కృషి జరుగుతుందని మంత్రి  వివరించారు. రెవిన్యూ డివిజన్ తరలిపోతుందంటూ వైసీపీ వాళ్లు విష ప్రచారం చేస్తున్నారన్నారు. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినా వారి కళ్ళకు కనబడట్లేదని, చెవులకు వినబడట్లేదని  దుయ్య బట్టారు.  చేతగాని రాజకీయాలు చేయడం తనకు తెలియదని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడమే తన నైజమన్నారు. వైసిపి వాళ్లు చెవిటి, మూగ వాళ్ళలా  నటిస్తున్నారని కావాలంటే వారికి కూడా పింఛను ఇచ్చే సదుపాయం ఏర్పాటు చేస్తానని మంత్రి చమత్కరించారు. పిపిపి విధానాన్ని తప్పుపడుతూ కోటి సంతకాల కార్యక్రమం పేరుతో  లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని, కార్యకర్తలు ఒక్కొక్కరు  రెండు మూడు సంతకాలు పెట్టలేక ఇబ్బందులు పడుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకు హాజరై  తమ గళాన్ని వినిపించాలని, అప్పుడు రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది  ప్రజలకు వైసిపి గళం  వినిపించవచ్చునన్నారు. ఒక ప్రక్క ప్రజలు చీదరించుకుని  11 సీట్లకు పరిమితం చేసినా బుద్ధి లేకుండా ఊక దంపుడు   ప్రసంగాలు  చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ వాళ్లకు  అర్థం చేసుకునే బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నా అన్నారు. గత 18 నెలల కాలంలో రామచంద్రపురం నియోజవర్గానికి  రూ.150 కోట్లు నిధులు తీసుకొచ్చి  అభివృద్ధి చేశామని, రానున్న పుష్కరాలకు మరో 150 కోట్లు నిధులు రానున్నాయని వెల్లడించారు. జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజా సమస్యలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పనిచేస్తున్నామన్నారు. వైసిపి ప్రభుత్వం లో కేటాయించిన ఇల్లు కేటాయింపులో అంతులేని అవినీతి జరిగిందని వాటిపై  ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ  ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో  పనిచేస్తుందని, ప్రజల అభీష్టం మేరకే పాలన సాగుతుందనన్నారు. ప్రజా దర్బార్ లో వచ్చిన అర్జీలు అన్ని సత్వర పరిష్కారం అయ్యేలా  అధికారులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్  అక్కల రి శ్వంతరాయ్, మున్సిపల్ కమిషనర్ రాజు, గృహ నిర్మాణ శాఖ డి ఈ  రాంబాబు, విద్యుత్ శాఖ డి ఈ రత్నాలరావు, తహసిల్దార్ బండి మృత్యుంజయరావు, వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ, మండల ప్రజా పరిషత్, వివిధ శాఖల అధికారులు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉండవెల్లి శివ, రామచంద్రపురం రూరల్ అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనుబాబు, బిజెపి నాయకులు దూడల శంకర్ నారాయణ, మేడిశెట్టి శేషారావు,కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక వైద్య శిబిరం

అర్జీదాలకు భోజన సదుపాయం

మంత్రి సుభాష్ క్యాంపు   కార్యాలయానికి  వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున అర్జీదారులు తరలిరావడంతో  మంత్రి సుభాష్  అర్జీదారులు ఇబ్బంది పడకుండా భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. అలాగే ముచ్చుమిల్లి   యూ పి హెచ్ సి  నుంచి వైద్య సిబ్బందితో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి ముందు ఉచితంగా అందించారు.  ప్రజా దర్బార్ వేదిక దగ్గరకు రాలేని  దివ్యాంగులను చూసి మంత్రి సుభాష్ స్వయంగా వారి దగ్గరికి వెళ్లి  సమస్యలు అడిగి తెలుసుకుని, అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొని తమ సేవలు అందించారు.