కాకినాడ జిల్లా కోసం సంతకాల సేకరణ, పోస్ట్ కార్డు ఉద్యమం జేఏసీ చేపట్టింది

కాకినాడ జిల్లా కోసం సంతకాల సేకరణ, పోస్ట్ కార్డు ఉద్యమం జేఏసీ చేపట్టింది.                                                                                              

కాకినాడ జిల్లాతోనే రామచంద్రపురం ఆర్డీవో కార్యాలయం ఉనికి ఆధారపడి ఉంది.


ద్రాక్షరామ  స్థానిక బోస్ బొమ్మ సెంటర్ వద్ద రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష జేఏసీ మంగళవారం సంతకాల సేకరణ, పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నిర్వహించింది.

రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల న్యాయబద్ధమైన, దీర్ఘకాలిక డిమాండ్‌ను కూటమి ప్రభుత్వం బహిరంగంగా నిర్లక్ష్యం చేస్తోందని జేఏసీ కన్వీనర్ మాగాపు అమ్మిరాజు, కో-కన్వీనర్ బత్తుల సిద్ధూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆశలను ఆవిరి చేసిన గత ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇక నేటి మంత్రి, ఎమ్మెల్యే సహా అధికార కుర్చీల కోసం ప్రజల ప్రయోజనాలను బలిచేస్తున్నారని వారు తీవ్రంగా మండిపడ్డారు.

గత ఐదు నెలలుగా అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన నిరంతర ఉద్యమాలు, 52 గ్రామ పంచాయతీలు, రెండు మండల ప్రజా పరిషత్  మరియు రామచంద్రపురం మున్సిపాలిటీ చేసిన ఏకగ్రీవ తీర్మానాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం అవమానకరమని జేఏసీ నాయకులు విమర్శించారు.

ప్రత్యేకంగా, అధికారంలో ఉన్న మంత్రి వాసంశెట్టి సుభాష్ కాకినాడ జిల్లా విషయంపై సుముఖత చూపకపోవడం దురదృష్టకరమని, ఇది ప్రజలంతా ఆలోచించవలసిన విషయం అని పేర్కొన్నారు.

రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపకపోవడం వల్ల రామచంద్రపురం, కే.గంగవరం మండలాలు దిక్కులేనివిగా మిగిలిపోతాయని జేఏసీ హెచ్చరించింది. రామచంద్రపురం ఆర్డీవో పరిధిలో ఈ రెండు మండలాలే ఉండటం వల్ల రెవెన్యూ డివిజన్ నిర్వహణ క్లిష్టమవుతుందని, క్రమంగా రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ అదృశ్యం అయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే రామచంద్రపురం, కాకినాడ జిల్లా విలీనం ప్రకటించాలని జేఏసీ డిమాండ్ చేసింది.

అలా చేయకపోతే రాబోయే మున్సిపల్ మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనతా తీర్పు కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతుందని నాయకులు హెచ్చరించారు.

రెవిన్యూ డివిజన్ కోసం పోరాటం చేయడం కన్నా, నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలన్న డిమాండ్ సరైంది  కాక సమగ్ర ప్రయోజనకరమని జేఏసీ నేతలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో కలిపితే, జిల్లా కేంద్రమైన కాకినాడ ప్రజలకు మరింత చేరువవడమే కాక, రామచంద్రపురం డివిజన్ కూడా స్థిరంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలంతా కాకినాడ జిల్లా కావాలని ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో  అధిక సంఖ్య లో ప్రజలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో  జనసేన  సీనియర్ నాయకులు ముప్పనపల్లి గణేష్, ఆళ్ల  సుబ్రహ్మణ్యం, ఆళ్ళ బుజ్జి, నల్లా  బుచ్చిరాజు,వీరు  బండి, దుళ్ళ కొండ,  రామచంద్రపురం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు దొమ్మలపాటి సత్యనారాయణ, టిడిపి సీనియర్ నాయకులు ఆకుల కొండ, ద్రాక్షారామ సర్పంచ్ కొత్తపల్లి అరుణ, కొత్తపల్లి రామారావు, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మోర్త దొరబాబు,  పీ.డీ.ఎస్.యు నాయకులు  కరుపోతు నవీన్  కుమార్ తదితరులు పాల్గొన్నారు.