రేవంత్‌కు కొస‌రు ఊర‌ట‌.. విష‌యం ఇదీ!


TELANGANA: తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి కొస‌రు ఊర‌ట మాత్రమే ల‌భించింది. ఆయ‌న గ‌త కొన్నాళ్లుగా ఎంతో ఆశ‌తో ఎదురు చూస్తున్న అస‌లు ఊర‌ట మాత్రం ఆయ‌న‌కు ల‌భించ‌లేదు. విష‌యం ఏంటంటే.. స్థానిక ఎన్నిక‌ల్లో బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని.. త‌ద్వారా బీసీల‌కు కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం అం డ‌గా ఉంద‌ని స్ప‌ష్టం చేయాల‌ని రేవంత్ రెడ్డి భావించారు. దీనికి సంబంధించిన బిల్లును రాష్ట్ర‌ప‌తికి పంపించారు. అక్క‌డ ఆమోదం ల‌భించ‌లేదు. దీంతో ఆర్డినెన్స్ అయినా.. తీసుకురావాల‌ని భావించారు. 


ఈ క్ర‌మంలో ఆర్డినెన్సును రూపొందించి గ‌వ‌ర్న‌ర్ విష్ణుదేవ్ శ‌ర్మ‌కు పంపించారు. కానీ, దీనికి గ‌వ‌ర్న‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు ఆమోదం తెల‌ప‌లేదు. మ‌రోవైపు.. మూడు నాలుగు వారాల్లోనే ఎన్నిక‌లు రానున్నాయి. ఈ క్ర‌మంలో దీనిని ఎలాగైనా సాధించాల‌న్న ప్ర‌య‌త్నం ఇప్ప‌టి వ‌ర‌కు సాకారం కాలేదు. ఇదిలావుంటే.. దీనికి ముందు మ‌రోఆర్డినెన్సును చేసి.. గ‌వ‌ర్న‌ర్‌కు పంపించారు. ఇది పెద్ద విష‌యం కాదు. కేవ‌లం ఒక ప్రాంతానికి సంబంధించిన ఆర్డినెన్స్‌. దీనిని తాజాగా గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం ఆమోదించింది. 

సంగారెడ్డి జిల్లాలో ఇంద్రీశం, జిన్నారం ప్రాంతాల‌ను మున్సిపాలిటీలుగా గుర్తించాల‌ని రేవంత్ రెడ్డి ప్ర‌భు త్వం నిర్ణ‌యించింది. దీనిపై బిల్లును రూపొందించి.. గ‌త ఏడాదే అసెంబ్లీలో ఆమోదం పొందింది. అనం తరం.. దీనిని గ‌వ‌ర్న‌ర్‌కు పంపించ‌గా.. తాజాగా ఆయ‌న దీనికి రాజ‌ముద్ర వేశారు. దీంతో ఈ రెండు ప్రాం తాల‌ను మునిసిపాలిటీలుగా ఏర్పాటు చేసుకునేందుకు అవ‌కాశం ఏర్ప‌డింది. దీనికి ఆమోదం చెప్ప‌డం బాగానే ఉన్నా.. అస‌లైన రిజ‌ర్వేష‌న్ క‌ల్పించే ఆర్డినెన్సుపై మాత్రం గ‌వ‌ర్న‌ర్ మౌనంగా ఉన్నారు. 

ఇక‌ మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో కొంద‌రికి రాజ్య‌స‌భ స‌భ్యుల‌కు కూడా ఓటు హ‌క్కు క‌ల్పించాల‌న్న‌ది కేసీఆర్ హ‌యాం నాటి ప్ర‌తిపాద‌న‌. అప్ప‌ట్లో ఓ కీల‌క ఉద్దేశంతో దీనిని ప్ర‌తిపాదించారు. అప్ప‌టి నుంచి ఇది రాజ‌భ‌వ‌న్‌లోనే ఉండిపోయింది. అయితే.. తాజాగా ఈ ఆర్డినెన్సుకు కూడా గ‌వ‌ర్న‌ర్ రాజ‌ముద్ర వేశారు. ఫ‌లితంగా రాజ్య‌స‌భ స‌భ్యులు.. ఇక నుంచి.. జ‌రిగే మున్సిపల్‌ ఛైర్మన్లు, వైస్‌ ఛైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికల్లో ఓటు వేసే అవ‌కాశం క‌ల‌గ‌నుంది. దీనిపై ప్ర‌భుత్వం గెజిట్ నోటిఫికేష‌న్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏదేమైనా రేవంత్‌కు కొస‌రు ఊర‌టే త‌ప్ప‌.. అస‌లు ఊర‌ట ల‌భించ‌లేద‌న్న‌ది రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్న‌మాట‌.