INDIA NEWS: మరణించిన వారిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా ఉన్నారు. పెద్ద ఎత్తున గాయాల బారిన పడిన వారిలో 28 మంది పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఊహించని ఉత్పాతానికి భూలోక స్వర్గంగా పిలిచే కశ్మీర్ కన్నీళ్ల సంద్రంగా మారింది. మేఘ విస్పోటనం భారీ ప్రాణ నష్టానికి కారణమైంది. కిష్ట్వార్ జిల్లాలోని మారుమూల గ్రామం చోసితిలో గురువారం హఠాత్తుగా చోటు చేసుకున్న క్లౌడ్ బరస్ట్ తో మెరుపు వరదలకు కారణమైంది. 46 మందిని మెరుపు వరదలు బలి తీసుకున్నాయి.
ప్రమాద తీవ్రతను చూస్తే.. మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఈ అనూహ్య విపత్తు ఎన్నో కుటుంబాల్లో పూడ్చలేని విషాదానికి కారణమైంది. మాచైల్ మాత ఆలయానికి వెళ్లే యాత్రికులు బసగా ఉండే గ్రామంలో మేఘ విస్పోటనం చోటు చేసుకోవటం.. మెరుపు వరదలకు వాహనాలు.. భక్తుల టెంటలు.. దుకాణాలు.. వసతి సౌకర్యాలు.. భద్రతా సిబ్బంది పోస్టులు అన్నీ కొట్టుకుపోయాయి.
మాచైల్ మాతను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఈ మారుమూల చోసితి గ్రామం బేస్ పాయింట్. ఇక్కడే యాత్రికులు తమ వాహనాల్ని.. వస్తువుల్ని ఇక్కడే వదిలి వేస్తారు. ఇక్కడి నుంచి కాలి నడకన కొండ ఎక్కి గుడికి వెళతారు. మెరుపు వరదలకు భక్తులు ఏర్పాటు చేసుకున్న టెంట్లు.. దుకాణాలు.. వంట సామాగ్రి మొత్తం కొట్టుకుపోయాయి. పెద్ద ఎత్తున గల్లంతైన వారున్నారు. స్థానిక వార్తా సంస్థల ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపు 200 మంది గల్లంతైనట్లుగా చెబుతున్నారు. మరణాలు మరింత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
మరణించిన వారిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా ఉన్నారు. పెద్ద ఎత్తున గాయాల బారిన పడిన వారిలో 28 మంది పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. మెరుపు వరదలకు కొట్టుకుపోకుండా స్థానికులు 167 మందిని కాపాడారు. హటాత్తుగా విరుచుకుపడిన వరదలకు దాదాపు సదరు గ్రామం తుడిచిపెట్టుకుపోయినట్లుగా చెబుతున్నారు. మాచైల్ మాతా యాత్ర గత నెల 25న మొదలైంది. ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా చోసితి నుంచి భక్తులు కాలి నడకన ఎనిమిదిన్నర కిలోమీటర్ల దూరం ఉండే కొండలు ఎక్కుతూ 9500 అడుగుల ఎత్తులో ఉండే గుడిని చేరుకోవాల్సి ఉంటుంది. మెరుపు వరదలకు దారుణంగా దెబ్బ తిన్న చోసితి గ్రామం కిష్ట్వార్ పట్టణానికి 90కి.మీ. దూరంలో ఉంటుంది.
మెరుపు వరదల సమాచారం అందుకున్నంతనే అధికార యంత్రాంగం వేగంగా స్పందించినా.. జరగాల్సిన నష్టం జరిగినట్లుగా చెప్పాలి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి భీతావాహంగా మారింది. సహాయక చర్యల్లో పాలు పంచుకునేందుకు అదనపు బలగాల్ని.. హెలికాఫ్టర్లను సిద్ధం చేశారు. సహాయక చర్యల్లో సైన్యాన్ని కూడారంగంలోకి దించారు. దాదాపు 300 మంది సైనికులు చోసితి గ్రామంలో సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. సముద్ర మట్టానికి 2800 అడుగుల ఎత్తులో ఉండే మాచైల్ మాతా మందిర యాత్రను తాజాగా నిలిపివేశారు.
మెరుపు వరదలతో చోటు చేసుకున్న పెను విషాదంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజౌరితో పాటు జమ్మూకశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లోనూ భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇక్కడి భారీ వర్షాల నేపథ్యంలో నేషనల్ హైవేతో పాటు 396 దారులను మూసేశారు. సిమ్లాలో విద్యుత్తు సరఫరా కార్యాలయం కూడా దెబ్బ తింది. సిమ్లా.. లాహోల్ -స్పితి ప్రాంతంలో పెద్ద ఎత్తున నిర్మాణాలు భారీ వర్షాల కారణంగా కొట్టుకుపోయినట్లుగా చెబుతున్నారు.
Social Plugin